Description
- లెనిన్ గురించి “ఒక స్వాప్నికుని కథ”
రచయిత – నాగభూషణ్ధర – ₹500/-
లెనిన్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా గల దోపిడీ, పీడన, అణచివేత, వంచన, వగైరా వివక్షలకు గురవుతున్న వివిధ సెక్షన్లకు చెందిన కోట్లాదిమంది జనాలకు ఆయన దేశ, కాలావధుల్ని దాటి మరీ స్ఫూర్తి ప్రదాత, స్మరణీయుడు.లెనిన్ మరణించి వంద సంవత్సరాలు దాటినా, ఆయనింకా శ్రామిక జనాల గుండెల్లో సజీవంగా నిలిచి వున్నాడు. ఇప్పటికే కాదు, ప్రపంచంలో ఇంకా ఏ రూపంలో వివక్ష నిలిచి ఉన్నా, దానికి గురయ్యే జనాల గుండెల్లో ఆయన నిలిచే ఉంటాడు.
ప్రపంచంలో ప్రప్రధమ సోషలిస్టు రాజ్య స్థాపకునిగా మాత్రమే ఆయన ప్రాముఖ్యత పరిమితం కాదు. ఆ సోషలిస్టు రాజ్యాన్ని కమ్యూనిష్టు రాజ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన పలు అడుగులు ముందుకు వేశాడు కూడా. ఆ ప్రయత్నంలో ఉండగానే ఆయన చనిపోయాడు.
మార్క్స్ కాలం నాటికి పూర్వం ఉన్న పలువురు మేధావులు సర్వమానవుల శ్రేయస్సు కోసం పరితపించారు. అసమానతలు లేని, మానవులంతా సుఖసంతోషాలతో విలసిల్లే ఒక నూతన సమాజం కోసం వారు అన్వేషించారు. అలాంటి సమాజాన్ని ఏర్పరచడం కోసం వారిలో ఎవరికి వారు రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు.
అయితే అవేవీ శాస్త్రీయ ఆధారాల మీద నిలబడేవి కానందున ఆచరణయోగ్యం కాక, కేవలం ఊహాజనిత వాదాలయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో జర్మనీకి చెందిన తాత్విక మేధావి కార్ల్‌మార్క్స్ వారి భావాలు నిజం చేసేందుకు సుదీర్ఘకాలం పరిశోధనలు చేసి, తన నాటికి బాగా అభివృద్ధి చెందిన జర్మన్ తాత్విక భావాలు, ఫ్రెంచి విప్లవ సిద్ధాంతాలు, బ్రిటన్ కార్మిక పోరాటాల అనుభవాలు కలబోసి, ఒక ఆచరణ యోగ్యమైన, శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
దోపిడీ,అణచివేత లేని సమాజం కావాలంటే, సంఖ్యాధిక్యం కలిగిన బలహీన శక్తులు తమను దోపిడీ చేసే బలమైన శక్తుల్ని ఐకమత్యంగా ఢీకొనాలని,అందు కోసం అవి సాయుధ విప్లవ పోరాటం చెయ్యాలని చెప్పాడు.ఈ సిద్ధాంతం సహేతుకంగా ఉండటం వల్లనే, దీనికి మానవజాతి విముక్తి సిద్ధాంతంగా పేరొచ్చింది.
ఈ సిద్ధాంతాన్ని మార్క్స్ ప్రతిపాదించడంతో, దీన్ని మార్క్సిజం అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే మార్క్స్ ప్రతిపాదించిన కార్మికవర్గ విప్లవం విజయం సాధిస్తుందని సోషల్ డెమోక్రాట్లు భావించారు. ఆ లెక్కన అది నాడు పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది, అక్కడి కార్మికులు రాజకీయంగా కూడా అభివృద్ధి చెందిన జర్మనీ దేశంలో మొదట ఈ విప్లవం విజయం సాధించాలి. కానీ అందుకు భిన్నంగా, పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న రష్యాలో అది లెనిన్ నేతృత్వాన విజయవంతం అయింది.
లెనిన్ జీవిత చరిత్ర రచన చాలా క్లిష్టమైన రచన. ఆయన జీవిత చరిత్ర ఘట్టాలు పూర్తిస్థాయిలో లిఖితమైలేవు. ఆయన ప్రచారానికి ఎల్లప్పుడూ ఆమడదూరంలో ఉన్నాడు. అంచేత ఆయన మరణానంతరమే పార్టీ పనుపున ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కామ్రేడ్లు కొన్ని వివరాలు, స్మృతుల రూపంలో రాశారు. ఆయన తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కామ్రేడ్లకు కూడా కొన్ని లేఖల్ని రాశాడు. వాటిలో కొన్ని నశించిపోగా, కొన్ని దొరుకుతున్నాయి. వాటివల్లే ఈ మాత్రమైనా ఆయన జీవిత విశేషాలు తెలిసే అవకాశం ఏర్పడింది.
పార్టీపరంగా ఆయన మరణానంతరం ఆయన సంక్షిప్త జీవిత చరిత్ర ప్రకటించారు గానీ, దాని ద్వారా ఎక్కువ విషయాలు తెలియడం లేదు. అందుకోసం ఆయన రాసిన వివిధ రచనలు, ఆయనపై వచ్చిన వివిధ రచనలు, స్టాలిన్ రాసిన బోల్షివిక్ పార్టీ చరిత్ర; తెలుగులో,ఆంగ్లంలో లభిస్తున్న రకరకాల సమాచారం ఆధారంగా చేసుకుని ఒక సమగ్ర పరిశోధక ప్రాజెక్టుగా ఈ గ్రంథ రచనను చేపట్టి పూర్తి చెయ్యడం జరిగింది.
మొదట ఈ రచనను కేవలం ఆయన రచనలు, పార్టీ నిర్మాణం,విప్లవ విజయం, ప్రభుత్వ స్థాపన,పాలన వంటి అంశాలతో కూడిన పూర్తిస్థాయి రాజకీయ జీవిత చరిత్రగా రాయాలనుకుని ఇంతకంటే పెద్దగా ఒక బృహద్గ్రంథాన్ని సిద్ధం చేశాను.
ప్రస్తుతకాలంలో ఇలాంటి భారీ రాజకీయ గ్రంథాన్ని పాఠకులు ఆదరించరేమోనన్న ఆలోచన వచ్చి, రాజకీయాంశాలు తగ్గించి, ఆయన కృషిని వివరించే 22 కథలతో కలిపి ఈ రచనను ప్రచురిస్తున్నాను.
ఆయన గావించిన రాజకీయ కృషి ఆధారంగా కథలు రాయడానికి ప్రధాన ప్రేరణ ప్రసిద్ధ రష్యన్ రచయిత శ్చెద్రీన్ కాగా, కొంతవరకు ‘లెనిన్ జీవిత కథ’ రాసిన ‘మరీయ ప్రిలెజోయెవా’. ఇంకా ఈ రచనకు అమెరికన్ జర్నలిస్ట్టులైన జాన్‌రీడ్, ఆల్బర్ట్‌రీస్ విలియమ్స్‌ల రచనలు, కూడా కొంత వరకు ఉపకరించాయి.
ఎన్ని గ్రంథాలు,రచనలు,వెబ్‌సైట్లు ఉపకరించినా, స్వీయ పరిశోధనతో అనేక వాస్తవాంశాలను కూడా ఇందులో చేర్చాను. అంచేత ఈ రచనను ‘లెనిన్ సంపూర్ణ జీవిత చరిత్ర’గా పేర్కొనడం జరిగింది.
ఆయన జీవితంలో ఎదురైన ‘అన్ని’ అంశాలు ఇందులో ఉన్నాయనడం కూడా సత్యదూరమే. సంక్షిప్త రచనలు తెలుగులో ఉన్నందున, వాటి పరిమితిని, అలాగే దీని విస్తృతిని తెలిపేందుకే దీన్ని ‘సంపూర్ణ జీవిత చరిత్ర’గా పేర్కొన్నాను.
ఈ గ్రంథంలో లెనిన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఆయన రచనలు సంక్షిప్త పాఠాలు, పార్టీ నిర్మాణం,విప్లవ పోరాటం, ప్రభుత్వ స్థాపన పాలన,అంతర్యుద్ధం ముఖ్య ఘట్టాలు, మూడో ఇంటర్నేషనల్ స్థాపన, ఆయన అంతిమ ఘడియలు వగైరా అంశాలన్నీ వివరంగా ఉన్నందున,ఈ రచన అభిమానులకు, సామాన్య కార్యకర్తలకు, అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
(ఒక స్నాప్నికుడి జీవిత కథకు రచయిత రాసుకున్న ముందు మాట నుంచి కొంత భాగం)
Reviews
There are no reviews yet.