Description
#పుస్తక_పరిచయం
#డబ్బు_కథ_వింటారా?
ఆర్థిక వ్యవస్థ గురించి… కూతురికి తండ్రి లేఖలు
యానిస్ వేరూఫెకిస్ అనువాదం: సుధాకిరణ్
ధర -150/-
‘డబ్బులు ఏటీయంలో వస్తాయి కదా. ఆఫీసుకెళ్లడం ఎందుకు?’ అంటూ అమ్మానాన్నల కాళ్లకు చిన్నారులు అడ్డంపడటం మనకి అనుభవమే.
అసలు డబ్బంటే ఏంటో దానికి ఎలాంటి విలువ ఇవ్వాలో కాస్త పెద్ద పిల్లలకైనా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా?
రచయిత యానిస్ వేరూఫాక్స్ ఆ ప్రయత్నం చేశారు. గ్రీకు,ఆస్ట్రేలియన్ ఆర్ధికవేత్త, రాజకీయవేత్త అయిన యానిస్ మంచి రచయిత కూడా.
అర్థశాస్త్ర బోధ కుడిగా పలు పుస్తకాలు రాసిన అతణ్ని ‘రాక్ స్టార్ ఆర్ధికవేత్త’ అంటారు.
‘టాకింగ్ టు మై డాటర్ అనే ఈ పుస్తకాన్ని ఆయన గ్రీకు భాషలో రాస్తే తెలుగు సహాపలు ప్రపంచభాష ల్లోకి అనువాదమైంది.
అర్థశాస్త్రాన్ని ఇంత సులభంగా పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పిన పుస్తకం బహుశా ఇంకోటి లేదేమో.
ఆర్ధికవ్యవస్థలోని ఒడుదుడుకులు జీవితాలను నిర్దేశిస్తున్న రోజుల్లో ఆ వ్యవస్థని మన చేతుల్లోకి తీసుకోవాలంటే దాని గురించి సాధికారికంగా తెలుసుకోవాలి- అంటారు రచయిత.
ఆయన గ్రీస్ లో ఉంటే కుమార్తె జెనియా ఆస్ట్రేలియాలో ఉండేది.దాంతో ఆమెకు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెబుతూ రాసిందే ఈ పుస్తకం.
మొదట మాట, తరువాత సాగు… మానవ సమాజాన్ని ఎలా మార్చాయి, ఫలితంగా వచ్చిన మిగులు ఉత్పత్తిని దాచుకోవడానికి లెక్కలు ఎలా పుట్టాయి… అన్నది వివరిస్తూ అసలు విషయంలోకి వెళ్తారు.
లోహరూపంలో డబ్బు ఉనికిలోకి రాకముందే దాన్ని లావాదేవీలలో వాడిన విధానం మెసపొటేమియా నాగరికత కాలంలోదని చెబుతారు.పన్నెండు వేల సంవత్సరాల క్రితమే వర్చువల్ మనీ విదానం ఉన్న వైనాన్ని వివరిస్తారు.
వ్యవసాయంలో మిగులు ఉత్పత్తి లేకపోతే ‘రాజ్యం’ అనేది ఉనికిలోకి వచ్చేది కాదంటారు.బ్యూరోక్రసీ, సైన్యం, పూజారివర్గం ఎలా ఏర్ప డ్డాయో చెబుతారు.
అసమానతలు,మార్కెట్ సమాజాల పుట్టుక, ప్రపంచ వాణిజ్యం ఎలా మొదలైంది. ఫ్యాక్టరీలు, బ్యాంకులు ఎందుకు వచ్చాయి… ఇలా అన్నింటినీ వివరిస్తూ ఉపయోగపు విలువ పైన మారకపు విలువ సాదించిన విజయం ప్రపంచాన్ని మార్చేసిందంటారు.
జీవావరణం నాశ నమైపోతుంటే ఆర్ధిక వ్యవస్థ లాభపడుతోందని, జీవావరణానికి ఉపయోగపు విలువ ఉన్నప్పటికీ మారకపు విలువ లేక పోవడమే అందుకు కారణమనీ వివరిస్తారు.
వ్యక్తిగత ప్రయో జనాలకు భూగోళ ప్రయోజనాలనూ జోడించడం సాధ్యమేనని, ఆదివాసులు దాన్ని చక్కగా నిర్వర్తించారంటారు.
పారిశ్రామిక విప్లవానికి ఇందనం బొగ్గు కాదు, అప్పు- అంటారు రచయిత. మార్కెట్ సమాజాల్లో సంపద అంతా అప్పుమీద ఆధారపడి పెరిగిందేనంటారు.
రాజకీయాల నుంచి డబ్బును తీసివేయవచ్చేమో కానీ డబ్బునుంచి రాజకీయాలను తీసివేయలేమనే రచయిత ప్రస్తుత పరిస్థితులకు నిజమైన ప్రజాస్వామ్యమే ఆచరణాత్మక పరిష్కారమని సూచిస్తారు.
ఈడిపస్,ట్రోజెన్ వార్ లాంటి గ్రీకు కథలను, నాటకాల్లోని ఘట్టాలను, వివిధ సినిమా సన్నివేశాలనూ ఉదహరిస్తూ రచయిత ఆర్ధిక విషయాలను వివరించిన విధానం పిల్లలకే కాదు, పెద్దలకూ ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్థికవ్యవస్ధ కోణం నుంచి మొత్తంగా మానవ సమాజ పరిణామాన్ని ఈ చిన్న పుస్తకంలో తెలుసుకోవచ్చు.
Reviews
There are no reviews yet.