Description
*మనను కదిలించే మన కథలు*
మనకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పడంలో ఉన్న ఆనందం మరెందులోనూ కలగదు. అందుకే ‘కథ అయినా కల అయినా కడుపులో భరించడంకన్నా గొప్ప వేదన మరొకటుండదు.’ అంటారు మాయా ఏంజిలో. ఎవరికీ చెప్పకుండా ఆ బరువును మోయడం అంత సులువుకాదు. అందుకోసమైనా తమకు తెలిసిన విషయాలను కథలుగా చెప్పాలి రచయితలు. అందునా పరిణతి చెందిన రచయితలు చెప్పకపోతే సాహితీరంగానికి, పాఠకలోకానికి తీరని అన్యాయం చేసినట్లే అవుతుంది. అందులోనూ ఎన్నో అంశాలపై పరిపూర్ణ అవగాహన కలిగి, రచనారంగంలో నిష్ణాతులైన ఆనందాచారిలాంటివారు చెప్పగలిగి ఉండీ చెప్పకపోవడం మరింత నేరమే అవుతుంది. వారు కార్ల్ మార్క్స్ కు సంబంధించిన పుస్తకాలను సులభతరం చేస్తూ రాసిన పుస్తకాలైనా, విమర్శ వ్యాసాలైనా, పాటలైనా, ఇక ఇప్పుడు లాంటి కవిత్వమైనా… ఇవేమీ కాదు… కరోనా వ్యాపించి దేశం అల్లకల్లోలం అవుతున్న తరుణంలో వారు గీసిన చిత్రాలైనా… ప్రక్రియ ఏదైనా సరే. అందులో ఆరితేరిన అనుభవం కనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తి కథలు రాస్తే ఎలా ఉంటాయి? అచ్చంగా జీవిత పార్శ్వాలను అద్దంలో చూపినట్లుండదూ? అవును. అక్షరాలా నిజం. కొన్నాళ్ళుగా వారు రాస్తున్న కథలను చదువుతున్నాను. నిశితంగా గమనిస్తున్నాను. శ్రద్ధగా నేర్చుకుంటున్నాను.
మనస్సు చూడకుండా కన్ను చూడలేదు అంటారు ప్రముఖ రచయిత, తత్వవేత్త బి.ఎస్. రాములు. రచయితలు ప్రతి అంశాన్ని మనసుతో చూస్తే తప్ప కథకు పునాది పడదు. తాము రాస్తున్న కథలో మెసిలే పాత్రలన్నింటినీ తనలోకి ఆవాహన చేసుకున్నప్పుడే ఆ పాత్రలకు ప్రాణం పోయగల్గుతారు. అప్పుడే ఆ కథ పక్వానికి వస్తుంది. అయితే కథను పక్వానికి తీసుకువచ్చేలా ఆయా పాత్రల తీరుతెన్నులు మలచగలిగే నేర్పూ, నైపుణ్య విన్యాసాలన్నీ రచయితవే అయి ఉండాలి. అవి ఉండాలీ అంటే రచయిత శిల్పిలా మారి తనను తానే మలుచుకోవాలి. ఇందుకు సాధనే ప్రధాన వనరు. కథలు రాయడం సులువుగా కనిపించే క్లిష్టమైన ప్రక్రియ. రచయిత తనకు తాను ద్రవంలా మారితే తప్ప ఆ పాత్రలోకి ఒదగలేరు. అటువంటి నేర్పు, నైపుణ్యం ఆనందాచారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన కథల పుస్తకం తేవడంలోనే కొత్త కానీ ముందు చెప్పినట్లుగా ఆయన సాహితీ ప్రపంచానికి కాదు.
సమాజంపై, సామాజిక పోకడలపై స్పష్టమైన అవగాహన కలిగిన నిండైన వ్యక్తి. ఆయనలో వ్యక్తిత్వాన్ని, రాతలను వేరుగా చూడటము కుదరని పనే. ప్రతీ అంశంపై విస్తృతావగాహన కలిగి, కాలానికనుగుణంగా తనను తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుండడం, తనతోపాటు నలుగురిని తీసుకెళ్ళడం ఆయనలోని నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనవి. ఆయన ఉత్తమ జాబితాలోకి రాగల మంచి వక్త కూడా. ఇవన్నీ తనను విలక్షణంగా నిలబెడతాయి.
కథలు అందరూ చెప్తారు. ఆనందాచారిలాంటి కొందరు మటుకు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెబుతారు. తొలి కథల పుస్తకంగా ‘గస్సాల్’ పాఠకుల ముందుకు వస్తుంది. ఇందులో పధ్నాలుగు కథలు ఉన్నాయి. ఏ కథా మరో కథను పోలి ఉండదు. వస్తువు కూడా ఎక్కడా పునరావృతం కాదు. కథలను భిన్నమైన శైలిలో వ్యక్తీకరించడంలో మొదటి కథతోనే ఆయన విజయం సాధించారు. అనుకున్న అంశంపై అలవోకగా కథను మలిచిన తీరును గమనిస్తే గై ది ముపాసా గుర్తుకు రాకమానరు. ఏ కథ చదివినా వస్తువు ఎంపిక, అందుకు తగిన ఫ్లాట్ ను సరిగ్గా సిద్ధం చేసుకున్నారు అనిపిస్తుంది. చెప్పాల్సిన అంశం పాఠకులలోకి తేలికగా వెళ్ళిపోతుంది. అలాగే ఎంతో తేలికగా అర్థమవుతుంది.
మన దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గంగా జీవిస్తున్న
ఎన్నో ముస్లిం కుటుంబాలలో ఉన్న దారిద్ర్యానికి మచ్చు తునకగా నిలుస్తుంది గస్సాల్ కథ. పుట్టుకతో అంటిపెట్టుకున్న సంస్కృతీ సంప్రదాయాలను, భాషను హేళన చేస్తున్నవారిపై నిరసన బాణం ‘లచ్చిమి’ కథ. అలాగే ఎంచుకున్న వస్తువుకు సరిగ్గా నప్పేలా కథన రీతిని మలిచారు. ఓ.హెన్రీ కథల్లో కనిపించినట్లు ఉదాత్తమైన పాత్రలు ఈ కథల్లో మనకు దర్శనమిస్తాయి. ఈ పాత్రలన్నీ మనకు సుపరిచితమైన పాత్రల్లా, మనమూ వారితో కలిసి పయనిస్తున్నట్లుగా కనిపిస్తాయి.
కథల్లో ఆయన చూపే ప్రతీకలు భిన్నంగానే దర్శనమిస్తుంటాయి.
‘మధ్యగది మాత్రం రాతిరైనట్టుగానే ఉంటుంది నట్టింట్లో తాండవించే దారిద్ర్యంలా’ అంటారోచోట. అలాగే ‘అందరూ నిశ్శబ్దంగా ఎవరి గదుల్లో వాళ్ళు ఆలోచనల్లో… వారిని భంగపరుస్తూ గదులు నిండిన నిద్ర’, ‘అనుబంధాలు ఇలా కాగితాల్లా విసిరివేయబడతాయన్నమాట’, ‘వెలుగు తాకని బతుకులు చీకట్లలోనే కలిసిపోతాయని’, ‘మెదళ్ళను పిండుకోవడం’, ‘జ్ఞాన బానిసత్వం’, ‘విజ్ఞాన వెట్టిచాకిరి’, ‘హ్యుమానిటీ సిక్’… ఇలా ఎన్నో వాక్యాలు కట్టిపడేస్తుంటాయి.
స్వతహాగా ఉపాధ్యాయులు, ఉత్తమ వక్త కూడా అయిన రచయిత కథా నిర్మాణంలో ఎక్కడా తడబాటుకు గురికాలేదు. కొన్ని విషయాలు ఎంతో ముఖ్యమని మనకు తెలిసినా వాటిపై శీతకన్ను వేస్తుంటాం. అటువంటి వాటిలో మాట్లాడుకోవటం ఒకటి. ఎంతటి సమస్యైనా మాట్లాడితే పరిష్కారమవుతుందని అందరికీ తెలిసిందే. అయినా పక్కింటివారినైనా పలకరించేందుకు ఏదో జాప్యం. పలకరింపే కరువై, ఎవరైనా పలకరిస్తే బాగుండని ఎదురుచూసే దుస్థితి దాపురించడం ఎంత దయనీయంగా ఉంటుందో ‘లక్ష్మీబాయి స్మారక సిమెంటు బల్ల’ కథ చెబుతుంది.
ఎటువంటి అంశాన్ని తీసుకున్నా సులువైన పరిష్కారాన్ని చూపుతూ మనసులు తేలికపరిచే ప్రతిభ తక్కువ మందిలో ఉంటుంది. ఈ లక్షణం ఆనందాచారిలో మెండుగా ఉందని నా అభిప్రాయం.
స్వతహాగా చైతన్యశీలి అయిన ఆనందాచారి పాత కాలం నుంచి ఆచారంగా వస్తున్న బూజుపట్టిన సంస్కృతీ సంప్రదాయాలను సముచితంగానే ప్రశ్నించారు కథల్లో. ‘ఎవడు సృష్టించాడు ఈ తరగతి! పరువూ మర్యాదలు, మానాభిమానాలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచారాలు… అన్నీ వీళ్ళకే సవాళ్ళుగా మూగుతాయి.’ అంటారు.
కథో, కవితో చదివినప్పుడు పాఠకులు ఏదో ఒక అనుభూతికి లోనవుతారు. ఏ అనుభూతికీ లోనవనప్పుడు అక్షరాలు కూర్చడం తప్ప మరేముంటుంది దానిలో.
తాము కథలు, కవిత్వం ఎవరినో ఉద్ధరించడానికి రాయడంలేదని చెప్పడం వింటున్నాం. ఇంతా కష్టపడి ఒక కథనో కవితనో రాసినప్పుడు, అది పది మందికి ఉపయోగపడటంలో తప్పేముందో ఎంతకీ అర్థంకాదు. స్వతహాగా సమాజం గురించే ఆలోచించే ఆనందాచారి గారు కథలు రాస్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని బహుజనుల పుస్తకం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇందులో నిరుద్యోగులు కనిపిస్తారు. గిరిజనులు కనిపిస్తారు. చెత్త సేకరించే వారు కనిపిస్తారు. మెకానిక్, పాన్ షాప్ లు నడిపే ముసల్మానులు కనిపిస్తారు. గృహిణులు కనబడతారు. అన్ని వర్గాలకు చెందినవారు కనబడతారు. దైనందిన జీవితంలో మనకు తారసపడే ప్రతి ఒక్కరి సమాహారమే ఈ పుస్తకం. ఇందులో నచ్చిన మరో అంశం ఏమిటంటే పురుషులతో సమానంగా నడిచే మహిళా పాత్రలు. వారి ప్రాముఖ్యతను ఎక్కడా తగ్గకుండా చిత్రీకరించగలిగారు. ‘కరుణ దొరకలేదు’ కథ మటుకు మిగతా కథలకంటే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. అదేమీ నిందాపూర్వక పరిస్థితి కాకపోవచ్చు. ఏ పాత్రకు ఆ పాత్ర సముచితంగానే కనిపిస్తుంది. ఈరోజుల్లో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు కనిపిస్తుండడం సర్వసాధారణం.
ఆధునిక యుగమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లోనూ ఎన్నో బూజుపట్టిన పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. తరతరాలుగా వారసత్వంగా కొడుకులు మాత్రమే ఆచరిస్తూ వస్తున్న ఒక సంప్రదాయాన్ని ఆడపిల్లలు కూడా చేయవచ్చని గస్సాల్ కథలో చెప్తారు. అలా చెప్పడం వల్ల కథ మరింత ఉన్నతికి చేరుతుంది. సామాజిక, ఆర్థిక, అసమానతలతోపాటు అన్ని కోణాల్లోనూ ఆలోచింపచేసిన కథ ఇది. అందుకే కథల పోటీల్లో సముచిత స్థానం లభించింది. చదువుల పట్ల, వివాహం పట్ల ఆడపిల్లపై తల్లిదండ్రులు చేస్తున్న ఒత్తిడికి నిదర్శనం ‘ఊర్వశి’.
ఇక మట్టితోను, పనితోనూ మనిషికి ఉన్న అనుబంధాన్ని కథారూపంలో చెబుతునప్పుడు అట్టడుగుస్థాయి నుంచి ఆయన చేసిన అధ్యయనం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆధునికత పేరిట విర్రవీగుతూ యువతను తన గుప్పెట్లోకి లాగుతున్న మార్కెటింగ్ మాయాజాలం పన్నుతున్న కుట్రలూ ఖుల్లం ఖుల్లాగా వెల్లడిస్తారు. ఎన్నో వాక్యాలు సరికొత్త డిక్షన్ లో కనిపిస్తుంటాయి.
“చందమామతో పోల్చకపోయినా వెలుగుతూనే ఉండే వదనమామెది.”,
“అమ్మ లేని రాత్రి రాణి గుండెలపై కూర్చున్నట్టే ఉంది.”
లాంటి ఎన్నో వాక్యాలు కట్టిపడేస్తాయి.
కథలన్నింటిలోని మహిళా పాత్రలు ఎంతో ఆత్మ విశ్వాసంతో నడుచుకుంటాయి. మానవత్వాన్ని నింపుకుని ఉంటాయి. అలాగే ఎంతో నిబ్బరంగా కదులుతూ భవిష్యత్ పట్ల ఆశావహ దృక్పథాన్ని ఏర్పరుచుకుంటాయి. కరోనా సమయంలో ఒక ఒంటరి మహిళ తనవారు లేరనే నిరాశతో కుంగిపోకుండా స్నేహబృందం ఇచ్చిన ధైర్యంతో ఆశావహ దృక్పథం కలిగి ఉండటాన్ని గొప్పగా చిత్రీకరించారు. అలాగే పక్షవాతంతో మంచానపడ్డ తల్లి కూతురిని చూసేందుకు పడిన ఆరాటం కన్నీటిని తెప్పిస్తుంది. కొన్ని కథలు చదివినప్పుడు
‘అన్నపురాశులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట’అన్న మహాకవి కాళోజి మాటలు గుర్తుకు వస్తుటాయి. ‘గస్సాల్’ లోని కథలు చదువుతుంటే ఆ మహనీయుడు మరోసారి గుర్తుకు రాక మానడు. ఈ ఆకలి కథలు పేదోడి కొండంత కడుపుకోతను అద్దంలో పట్టి చూపినట్లుంటాయి.
పుస్తకంలోని ప్రతీకథ చదివించే కథే. చదవాల్సిన కథే. ఆలస్యంగానైనా మా తెలంగాణ సాహితి బృందం విన్నపాలు మన్నించి కథల పుస్తకంగా వస్తున్న ఆనందాచారి గారికి హార్ధిక స్వాగతం. ఇకపై కథలను ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరత్వరగా పుస్తకాలుగా రావాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి పుస్తకానికి నావైన కొన్ని అక్షరాలను జతచేస్తున్నందుకు సంతోషిస్తూ… వారికి మరోసారి స్వాగతాభినందనలు.
– నస్రీన్ ఖాన్
Reviews
There are no reviews yet.