అంతరంగం – Antharangam

200.00

వర్తమాన కాలంలో మానవ సంబంధాలు  జరుగుతున్న పరిస్తుతులు, స్వార్ధ. నిస్వార్థ పరమైన నేటి గతులు స్థితిగతులు రాజకీయ ఆర్థిక సామజిక అంశాలు కళ్ళకు కట్టినట్టు అక్షరాల్లో చూపించిన ఈ పుస్తకం  అందరూ చదవడానికి వీలున్న ఈ పుస్తకం వెంటనే కోనేయండి…

Category:

Description

👆👇

సకల సామాజిక అంతరంగ తరంగాలు : డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్

కొన్ని విషయాల అంతరార్థం విడమర్చి చెప్పేవరకు దాని విస్మృత, విపక్ష, వివక్షిత కోణం పాఠకులకు స్ఫురించదు. అమ్ముడు పోయిన మీడియా కాలంలో ‘అదర్‌సైడ్‌’ ఏమున్నదనేది బాధితులు, పీడితుల గొంతు వింటేగానీ అర్థంగాదు. ఆధిపత్యాల, అఘాయిత్యాల గుట్టును రట్టు చేస్తూ ఆర్టీఐ కార్యకర్తలు మొదలు మానవ హక్కుల కార్యకర్తల వరకు ఉద్యమిస్తున్నారు. ఈ గొంతుకలకు తమ కార్యాచరణ జోడిరచి చాలా మంది ఉద్యమకారులు, విద్యార్థులు, బుద్ధిజీవులు కార్య క్షేత్రంలో పని చేస్తున్నారు. నిజానికి ఉద్యమం అంటే రోడ్డు మీద బైఠాయింపులు, ధర్నాలు, ప్రదర్శనలు, జైలు శిక్షలే గాదు` ఆధిపత్యాన్ని, అవమానాల్ని ప్రశ్నించే విధంగా, కొట్లాడే వారికి సంఫీుభావం తెలిపేలా, స్వీయ లోపాలను సరిదిద్దుకునే విధంగా ప్రజలను తీర్చిదిద్దడం కూడా ఉద్యమమే! ఈ ఉద్యమ స్ఫూర్తితో హక్కులు, విధులు, బాధ్యతలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, నైతికత, గౌరవం, జీవితంతో సహా సకల సంశయాలను, అంశాలను విప్పుతూ, విడమర్చి చెబుతూ, సమస్యలను సాహిత్యానుశీలనతో చర్చకు పెట్టిన పుస్తకం ‘అంతరంగం’. కాలమ్ నా వ్యాసాలు. ఈ అంతరంగ తరంగాలను రంగం మీదికి తెచ్చి సాహిత్య, సామాజిక, సందేశ, యాత్రా కథనాలుగా మలిచింది అన్నవరం దేవేందర్‌.
దేవేందర్‌ పూర్వాశ్రమంలో జర్నలిస్టు కావడంతో నిరంతరం రాసే నైపుణ్యం అబ్బింది. కొన్ని సార్లు నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది కూడా! అందుకూ సిద్ధమన్నాడు. వారం`వారం ఎలాంటి ‘నాగ’ లేకుండా, జరమొచ్చినా, ప్రయాణాల్లో ఉన్నా, ఎన్ని పని వత్తిడులున్నా ‘కాలమ్‌’ రాయడమన్నది కత్తిమీద సాములాంటిదే! ఈ కత్తి మీద సాము చేసి నెగ్గుకు వచ్చిన కార్యశీలి అన్నవరం. ‘కాలమ్‌’ రాయడం పది నిమిషాలే కావొచ్చు. కానీ దాని వెనుక ప్రతివారం మానసిక చర్నింగ్‌ జరుగుతూ ఉంటుంది. ఒక్కొకప్పుడు ముందుగా అనుకున్నది గాకుండా సడెన్‌గా కొత్త అంశం తెరమీదికి వచ్చి దాని గురించి అధ్యయనం చేసి తనదైన దృక్కోణాన్ని జోడించి రాయాల్సి ఉంటుంది.
నిజానికి ‘కాలమ్‌’ రాయడమంటే సొంత సమయాన్ని సమాజం కోసం త్యాగం చేయడం, సమయం ఒక్కటే కాదు ఆర్థిక వనరులు కూడా. ఇట్లా రాయడం వల్ల ప్రతిఫలం ఎట్లాగూ ఉంటుంది, కానీ దాని కన్నా ఎక్కువగా ప్రతిపక్ష వర్గం ఒకటి తయారవుతుంది. ఎందుకంటే ‘కాలమ్‌’లో ఎంపిక చేసిన రచయితల పుస్తకాల మీదనే రాస్తున్నడు. నా పుస్తకం గురించి ఇందులో రాయడంలేదు అని భావించే అవకాశమున్నది. ఈ ‘అంతరంగం’లోని మొత్తం 150 వ్యాసాల్లో దాదాపు 30 పుస్తక సమీక్షలున్నాయి. వీటిని కేవలం సమీక్షలు అనే కన్నా దృష్టికోణాన్ని విస్తృత పరిచే రచనలని చెప్పాలి.
జీవితానుభవం, నిశితాధ్యయనం, సేవా తాపత్రయం, లెర్నింగ్‌` అన్‌ లెర్నింగ్‌ అండ్‌ రీ లెర్నింగ్‌, పే బ్యాక్‌ టు ది సొసైటీల కలబోత ఈ గ్రంథం. సమకాలీనాంశాలపై లోచూపుని సారించాడు. తెలుగు సమాజాన్ని చైతన్య పరిచిండు. హితవు చెప్పిండు. బాధ్యతలను గుర్తు చేసిండు. ప్రభుత్వాల ఆలసత్వాన్ని, ప్రభుత్వాధినేతల వాచాలత్వాన్ని, చదువుకున్న వారిలో సైతం కొరవడుతున్న శాస్త్రీయ దృక్పథాన్ని, కరోనా కాలములో వ్యాక్సిన్లు`ఆక్సిజన్‌ సిలిండర్‌లు దొరకని దుర్దశను, మనుషుల చావులో సైతం గట్టిగా ఏడ్వలేని బాధను, ఒకరి నొకరు పట్టుకొని ఓదార్చే వీలు లేని ‘లాక్‌డౌన్‌’లను ఇందులో అక్షరబద్ధం చేసిండు. ఒక రకంగా గత మూడేండ్ల కాలములో తెలుగు సమాజం ఏ ‘తొవ్వ’లో నడిచిందో చెప్పిండు. తెలంగాణ మనుషుల జీవితపు ప్రతి మలుపును ఈ వ్యాసాలు సంక్షిప్తంగానే అయినా నిక్కచ్చిగా రికార్డు చేశాయి. లోటుపాట్లను సూటిగా ప్రశ్నించాయి. సరిదిద్దుకోవాల్సిన అంశాలని ఢంకా బజాయించి చెప్పాయి.
అంతరంగం ‘కాలమ్‌’లోని వ్యాసాలను సాహిత్యం, సమాజం, సా‘మాన్యు’లు, సందేశం, సకలంగా విభజించ వచ్చు. ఇది బ్రాడ్‌ విభజన మాత్రమే. కొన్ని వ్యాసాలు ఒకటి కంటే ఎక్కువ వర్గాలలో చేరడానికి అర్హమైనవి కూడా ఉన్నాయి. అయితే వీటిని దేవేందర్‌ ‘ వర్తమాన జీవన చిత్రణ ’ అని పేర్కొన్నాడు. ఈ జీవన వికాస వ్యాసాల్లో ఉద్దేశ పూర్వకంగానో లేదా మరో విధంగానో ప్రజాస్వామిక పునాదులైన నాలుగు స్థంభాలు ‘జ్యుడిషియరీ’, ‘లెజిస్లేటివ్‌’, ‘ఎగ్జిగ్యూటివ్‌’, ‘మీడియా’ల్లో మొదటి దాన్ని మినహాయించి మిగతా అన్నింటిని అరుసుకున్నడు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి తన వంతుని కృషిని చేసిండు. ఈ వ్యాసాలకు వాడిన ఇంగ్రీడియెంట్స్‌, వినియోగించిన పొయ్యి, బంతి భోజనం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికి వారు తిని/చదివి రుచి తెలుసుకోవడమే. ఎందుకంటే ఒకరి టేస్ట్‌ బడ్స్‌ మరొకరితో మ్యాచ్‌ గావు. కాకపోతే వంట రుచిగా, శుచిగా, ఆకలి తీర్చేదిగా ఉందని మాత్రం చెప్పవచ్చు. ముందుగా అటికె, కుండలో వండిన కాయి బువ్వ లాంటి సాహిత్యం గురించి చర్చించుకుందాం!
సాహిత్యం
ఈ ‘అంతరంగం’లో దాదాపు 30 పుస్తకాల పరిచయమున్నది. మెజారిటీగా కరీంనగర్‌ జిల్లా వాండ్లవి అందులోనూ దేవేందర్‌కు ఇష్టమైన ప్రక్రియ కవిత్వం మీద రచనలు ప్రధానంగా ఉన్నాయి. కరీంనగర్‌ సాహితీ మిత్రులు, ఉద్యమ దోస్తులు గాజోజు నాగభూషణం ` ప్రాణదీపం, బూర్ల వెంకటేశ్వర్లు `ప్రాణగంధం, నలిమెల భాస్కర్‌ ` ఇక్కడి నేల అక్కడి వాన (అనువాద కవిత్వం), పెనుగొండ సరసిజ ` ఇక మారాల్సింది నువ్వే, దామరకుంట శంకరయ్య `వయ్యి, కందుకూరి అంజయ్య `జమిడిక, రిక్కల సహదేవరెడ్డి ` రక్తచలన సంగీతం, కె.వి.నరేందర్‌ ` బొడ్లె సంచీ కవితా సంపుటాలపై అభిప్రాయాలను రికార్డు చేసిండు. వస్తు విశిష్టతను చెప్పిండు. కొత్త కోణాలను ఆవిష్కరించిండు. ‘కన్నీటికి నిలువుటద్దంపై పంక్తులు రాసింది గాజోజు నాగభూషణం’ అని ఒక్క వాక్యంలో సారాన్ని చెప్పిండు. అట్లాగే తెలంగాణ ఉద్యమ పాటలు ‘నిప్పుల వాగు’ (అందెశ్రీ సంపాదకత్వం), పులికొండ సుబ్బాచారి `తెలుగింటి జానపద కథలు, పిన్నంశెట్టి కిషన్‌ `లేంబాల వాటిక కథలు, గజేందర్‌ రెడ్డి `వెలుగుల వెల్లువ, కూకట్ల తిరుపతి ` జల్లెడ, గోపగాని రవీందర్‌` శతారం తదితర సంపుటాలు, సంకలనాల విశిష్టతను లెక్కగట్టిండు. గురజాల రవీందర్‌ `బొగ్గు రవ్వలు, సంగిశెట్టి శ్రీనివాస్‌ ` రెడ్లు వెలమలేనా? బీసీలు సిఎం కావొద్దా?, బూర్ల వెంకటేశ్వర్లు`ఉపకారి, మంగళారపు లక్ష్మణ్‌ ` మాయని గాయం నెత్తుటి చరిత్ర, మేర మల్లేశం జీవితం, గులాబీల మల్లారెడ్డి ` మల్‌దాదా (నవల), అవునూరి సమ్మయ్య `గమనం (ఉద్యమ జ్ఞాపకాలు) తదితర గ్రంథాలపై ఇందులో విశ్లేషణలున్నాయి. ‘కాలమ్‌’ స్పేస్‌ తక్కువగా ఉండడంతో అందులో సరిపోయే విధంగా పరామర్శ చేసిండు. ఇందులో చివరి మూడు పుస్తకాలు హుస్నాబాద్ తో సంబంధం ఉన్న పుస్తకాలు. మంగళారపు లక్ష్మణ్‌ జర్నలిస్టుగా దేవేందర్‌కు దోస్తు. ఆయన తన అనుభవాలతో ఆ ప్రాంత మావోయిస్టు ఉద్యమ జీవితాలను రికార్డు చేసిండు. అట్లాగే మేర మల్లేశం సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం రెండిరటిలోనూ పాల్గొన్న కవి, కార్యకర్త. గులాబీల మల్లారెడ్డి పత్రికలు నడిపించడమే గాకుండా నవలలు, కథలు రాసిండు. ఈ ముగ్గురితోనూ అదే ప్రాంతం వాడైన దేవేందర్‌ బంధం పెనవేసుకొని ఉన్నది. ఉద్యమ జ్ఞాపకాలను, నెత్తుటి మరకలను, గాయాలను ఈ వ్యాసాల్లో చిత్రికగట్టిండు. మల్‌దాదా నవల గులాబీల మల్లారెడ్డి తాతా చరిత్రే. ఆయన ఆ తురకవాని కుంట ప్రాంతంలో ఎట్లా సామాజిక సమరసత సాధించిండో చెప్పిండు. అట్లాగే తాను చదువుకున్న పాఠశాల 75 ఏండ్ల సందర్భాన్ని, అందులో చదువుకొని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారిని గుర్తు చేసుకుంటూ ఘనతను చాటి చెప్పిండు. అంతేగాదు హుస్నాబాద్ సామాన్యులను సైతం లెక్కగట్టిండు. చరిత్రకెక్కదగ్గవారిని మక్కువతో ఎత్తి చూపిండు.
సా‘మాన్యులు’
దేవేందర్‌ తన కాలమ్‌లో స్ఫూర్తిప్రదాతలను అక్షరబద్ధం చేసిండు. ఇందులో వ్యక్తులుగా బెక్కటి బాలయ్య, వేణు సంకోజు, రజనిశ్రీ, ఇర్ఫాన్‌ మహమ్మద్‌లను, నవ్య, షేజల్‌, తుల్జా, తులసీ, బర్రెలక్క, కుల్వీంర్‌ కౌర్‌, నాయిని నరసింహారెడ్డి, బద్రివిశాల్‌ పిట్టి, మఖ్దూం మొహియుద్దీన్‌ లను, పేర్ల పేరుతో ‘శ్రీనివాస్‌’లను సాహిత్యంలో నిలబెట్టిండు. బెక్కటి బాలయ్య మొబైల్‌ ఫోన్లు లేని కాలములో ఎవరికి ఏ అవసరమొచ్చినా ఫోన్‌లు చేసి సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని చెప్పిండు. అట్లాగే కాలువ మల్లయ్య సారు సప్తతి సందర్భంగా, ఎన్‌.గోపి సారు 75 ఏండ్ల ఉత్సవాల సమయములో, జూలురు గౌరీశంకర్‌ తెలంగాణ సాహిత్య అకాడెమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు వాళ్లని, వారి సాహితీ సేవలను కొనియాడిరడు. వారి సాహితీ ఘనతను రికార్డు చేసిండు. ఇప్పటి వరకు ఇరవైవేల పేజీలకు పైగా కాలువ మల్లయ్య సారు రచనలున్నాయని లెక్కగట్టి మరీ చెప్పిండు. అట్లాగే తెలంగాణ ఆర్తి నిజాం వెంకటేశం, గద్దర్‌, రేగులపాటి కిషన్‌రావుల మరణ కాలములో వారిని గుర్తు చేసుకున్నాడు.
35 ఏండ్ల కిందటే కరీంనగర్‌లో జర్నలిస్టుగా, ఉద్యమాలను, ఉద్యమ నాయకులను దగ్గరి నుంచి చూసిన వాడు కావడంతో మంచి ` చెడు విశ్లేషణ, వివేచన దేవేందర్‌కు మొదటి నుంచే ఒంట బట్టాయి. అందుకే తాను నేర్చుకున్న, తెలుసుకున్న మంచిని పది మందికి చెప్పడం అలవాటు చేసుకున్నడు. సర్వీస్‌లో ఉన్నన్ని రోజులు ఆ పనిని ‘కవిత్వం’ ద్వారా చేసిండు. ఇప్పుడు రిటైరైనాక ఈ కాలమ్‌ ద్వారా చెప్పడం షురువ్‌ జేసిండు. ఎనుకట జర్నలిస్టు కాబట్టే ఇప్పుడిలా ‘సందేశం’ ఇవ్వగలిగిండు.
సందేశం
గతంలో ఎప్పుడో తప్ప మనుషులు పెద్దగా మద్యం తాగేవారు కాదు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది తాగుడుకు అలవాటయ్యిండ్రు. ఇదే ఏ సమాజానికైనా చేటు చేస్తుంది. తాగుడు వలన సమాజంలో అనేక హింసా ప్రవృత్తులు చోటు చేసుకుంటున్నాయి. విచక్షణ కోల్పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ‘కాలమ్‌’ద్వారా మనుషుల్లోని క్రూరత్వాన్ని, హత్యా ప్రవృత్తిని, హింసా దోరణిని, విద్య ఉన్నా విజ్ఞానం లేకుండా మూఢనమ్మకాల బారిన పడి మసి అవుతున్న వాళ్ల గురించి, బాధ్యతలు మరుస్తున్న పౌర సమాజం, పోరాట బాటను మరిచిన ఉద్యోగ, కార్మిక వర్గాలు, సంఘాలే లేని ‘సాఫ్ట్‌వేర్‌’ రంగాన్ని ఎత్తి చూపించిండు. దెప్పి పొడిచిండు. లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని హితవు చెప్పిండు. అహం అన్ని రోగాలకు మూలం అని జ్ఞానోపదేశం చేసిండు. సామాజిక సమస్యలపై చైతన్యం కలిగించిండు. బహుజన దృక్కోణమూ జోడిరచాడు.
నవ్వుతూ ఉద్యోగం చేయాలంటూ సలహా ఇచ్చిండు. ఆర్టీసీ, టీచర్‌, సింగరేణి ఉద్యోగాలు 90లకు ముందు మధ్యతరగతిని సృష్టించింది. వీళ్ళ పిల్లలు ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకొని ఇతర నగరాల్లో, విదేశాల్లో సెటిల్‌ అవుతున్నారు. అయితే రెక్కలు వచ్చిన పక్షి ఎగిరి పోవడం ఆధునిక కాలంలో తప్పదు, తప్పనిసరి అంటూ వృద్ధాప్యంలో పిల్లలు దగ్గర లేరు, పిల్లల దగ్గర తాము లేము అని బాధపడవద్దంటూ పెద్దలకు హితబోధ చేసిండు. అట్లాగే ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్లు అన్ని పనులు తామే చేసుకోవాలని తాపత్రయ పడకుండా కొన్ని పనులు వేరొకరితో చేయించుకున్నట్లయితే వారికి సైతం ఉపాధి ఇచ్చిన వారవుతారని సూచించారు. ఇది రిటైరైన టీచర్లకు ఎక్కువగా వర్తిస్తుంది.
బర్త్‌డేలు జరుపుకోవడం వల్ల ఆనందాలు పంచుకోవడానికి తోడ్పడుతుందని చెప్పిండు. దీర్ఘకాలం ప్రభుత్వోద్యోగములో ఉన్న అనుభవముతో` ప్రభుత్వోద్యోగులు ప్రజా సేవకులమని మరిచారని, అట్లాగే రాజకీయ నాయకులు సేవకులుగా గాకుండా యజమానులుగా వ్యవహరిస్తున్నారని హెచ్చరించిండు. వాళ్లు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికిండు. సినిమాలు` మద్యం` సింగిరేణి సంబంధాలను ప్రశ్నించిండు. గుట్టలను గ్రానైట్‌ మాఫియాలు మింగి ప్రకృతిని హరించిన తీరును చెబుతూనే గ్రామాల్లోని ‘వైకుంఠధామా’లను కొనియాడిరడు. నీరక్షీర వివేకంతో వ్యవహరించిండు. నైతికత చాదస్తంగా మారడాన్ని, దిగజారుడు రాజకీయాలు, దిగదుడుపు భాష ‘సకలం’ తన ‘అంతరంగం’ ద్వారా అన్నవరం ఆవిష్కరించిండు.
సకలం
ముందు ప్రస్తావించిన వర్గాల్లో చోటు చేసుకోని విషయాలను ఈ విభాగంలో ప్రధానంగా చేర్చినాను. ఇందులో ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’, ‘బతుకమ్మ`పాట’, నక్సలైట్ల మూలంగా అబ్బిన ప్రశ్నించే తత్వం, తార్కిక ఆలోచన, రియల్‌ ఎస్టేట్‌ ` ఈజీ మనీ, డోకాలు, స్నేహం, సినిమా, కళ, బలగం`సినిమా, తెలంగాణ భాష, స్త్రీలు` సమాజం, మగాహంకారం, కెమెరా కోసం జరిగే పెళ్ళిల్లు, మారుతున్న పెళ్లి వయసు, తిండి వేస్టేజ్‌, టేక్‌ అవే ఫుడ్‌ కల్చర్‌, కంకి పోయి పాప్‌కార్న్‌ని తెచ్చిన మార్కెట్‌ మాయాజాలాన్ని ఉద్యమస్ఫూర్తితో చెప్పిండు. మనిషి ఉన్న ఊరిని వదిలి కొత్త ప్రదేశానికి వెళితే గానీ తమ ప్రదేశాల్లోని గొప్ప/లోటు తెలుసుకోలేము అనేది సత్యము. పోల్చి చూసుకున్నప్పుడు మాత్రమే మన స్థితిని సరిగ్గా అంచనా వేయడానికి వీలవుతుంది. అందుకే దేవేందర్‌ ఏ అవకాశం దొరికినా కొత్త ప్రదేశాలు చూడ్డానికి ఉత్సుకత చూపిస్తాడు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళితే అక్కడి మట్టి మనుషులతో మాటలు కలిపి దాని మర్మాన్ని తెలుసుకుంటాడు. అట్లా కేరళ, జమ్మూ కశ్మీర్‌, డిల్లీ, మారేడు మిల్లి ప్రయాణాల్లో తెలుసుకున్న మర్మాలని పాఠకులకు విడమర్చి చెప్పిండు. ఉస్మానియా సాహిత్య ఉత్సవం, డిల్లీ సాహిత్య సదస్సు, బుక్‌ ఫెయిర్లు, ఉత్సవాలు, పదేండ్ల తెలంగాణ, తెలంగాణ తల్లిపై ప్రేమ ఇట్లా అనేక విషయాలపై తనదైన పదునైన వాక్యంతో కమ్మిన మాయా పొరల్ని చీల్చి సత్యాన్ని దర్శింప జేసిండు.
కొసరు
అన్నవరం దేవేందర్‌ రచన అంటేనే అది తెలంగాణ తల్లి కమ్మనైన భాషకు అక్షర రూపం. అందుకే ‘పుల్లగండు’, ‘ఒకారం’ తదితర పదాలను అన్నవరం మాత్రమే సాహిత్యంలోకి తీసుకు రాగలడు. ఇందులో తీసుకొచ్చిండు. నిరంతరాయంగా మూడేండ్లకు పైగా ఒక కాలమ్‌ తెలుగు పత్రికల్లో రాయడమంటే కష్టసాధ్యమైన పని. ఈ కష్టమైన పనిని ఇష్టంగా చేసిండు అన్నవరం. కరోనా కాలములో మనుషులో బయటికి వెళ్లడానికి సైతం గజ గజ వణుకుతున్న సమయంలో ప్రారంభమయిన డిజిటల్‌ పత్రిక ‘దిశ’. ఈ పత్రికలో సాహిత్య పేజి కేటాయించడమే ఆశ్చర్యకరమైన అంశం. అట్లాంటిది ఆ సాహిత్య పేజీలో అన్నవరం దేవేందర్‌ ‘కాలమ్‌’ ఉండడం అరుదైన అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నిజమైన పెద్దరికంతో ‘హితవు’ చెప్పిండు. సాహిత్యమంటే హితవు చెప్పేదే కదా. రాజకీయ నాయకులపై ఎన్నికల సమయంలో సంయమనంతోనే అయినా సూటిగా ప్రశ్నించిండు. ఓటర్లకు దిశా నిర్దేశం చేసిండు. దేవేందర్‌ సోషల్‌ సైంటిస్ట్‌గా మారి ‘కులవృత్తి దాటి బయటికి రావాలి’ అని పిలుపునిచ్చాడు. అవును కులవృత్తిలో కూరుకుపోయినన్ని రోజులు కూడుకు కష్టమే అన్నది నిజం.
ప్రపంచీకరణ అనేది రెండంచుల కత్తి. దాన్ని ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది. అయితే దాన్ని ఎక్కువగా నెగిటివ్‌ షేడ్‌లోనే దేవేందర్‌ చూసిండు. నిజానికి బహుజనులకు ప్రపంచీకరణ మేలు చేసిందనే చెప్పాలి. కొంతలో కొంతైనా వివక్షతను తగ్గించింది. అట్లాగే కాలమ్‌లో చాలా సార్లు ‘వరకట్నం’ తీసుకోవడం నేరంగా గాకుండా గౌరవంగా మారిందని వాపోయిండు. ‘కాలమ్‌’లో పేర్కొన్నప్పుడు ఇది సమస్య కాదు. కానీ వాటిని పుస్తకంగా తీసుకువస్తున్నప్పుడు ఈ రిపిటీషన్‌ ఇబ్బంది పెడుతుంది.
‘‘ఒకాయన కవిత్వం, కథలు, నవలలు రాస్తున్నాడంటే తన అనుభవాన్ని, తన భావాలను పదిమందికి చెప్పాలనుకుంటున్నాడు అని అర్థం’’ అని దేవేందర్‌ ఇందులోని ఒక వ్యాసంలో చెప్పిండు. నిజానికి ఈ పదాలు ‘అంతరంగం’కు కూడా వర్తిస్తాయి.
దేవేందర్‌ చెప్పినట్టు ‘‘మనిషి పుట్టుక, ఎదుగుదల, సంసారం, వలసలు, వరసలు, రాజ్యం, సామ్రాజ్యం, యుద్ధం`శాంతి, ప్రేమ, మతం, ఆధ్యాత్మికత అన్నీ అచ్చం నేర్పించేది మనముందున్న పుస్తకాలే’’ అనే విషయం ఈ పుస్తకానికి వర్తిస్తుంది. మన ఎదుగుదలలో ఈ పుస్తకమూ అవసరమే!
ఈ వ్యాసాల ద్వారా తన ఒక్కడి ‘అంతరంగం’ మాత్రమే గాకుండా సమాజానికి బాకీ పడ్డాము అని భావించే బుద్దిజీవులందరి భావనలను ఆవిష్కరించాడు. కరోనానంతరం తల్లడమల్లడవుతున్న మనుషుల జీవన టీకా`తాత్పర్యమిది. తన బాకీని ఈ పుస్తకం ద్వారా అన్నవరం కొంత తీర్చుకున్నాడు. దీన్ని చదివి, మంచి విషయాలను ఆచరణలోకి తీసుకొచ్చి మనవంతు కర్తవ్యాన్ని పాఠకులుగా నిర్వహించాల్సి ఉన్నది

వెల. ₹200.00

Reviews

There are no reviews yet.

Be the first to review “అంతరంగం – Antharangam”

Your email address will not be published. Required fields are marked *